(ఖానాపూర్): ఆదివాసీ మహిళా లోకం కదం తొక్కింది. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐటీడీఏ ముట్టడి నిర్వహించారు. సూమారు ఐదు వేలకు పైగా ఆదివాసీలు అందోళనలో పాల్గొనడంతో ఉట్నూర్ మండల కేంద్రంతో పాటు ఐటీడీఏలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముందుగా ఆదివాసీలు మండల కేంద్రంలోని వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏటీడీఏకు వేల సంఖ్యలో ఆదివాసీలు చేరుకోవడంతో ఉట్నూర్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఐటీడీఏ ప్రధాన రహదారిపై ఆదివాసీలు బైటాయించి నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్ అక్కడకు చేరుకుని వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. అయినా ఆందోళనను ఆదివాసీలు విరమించలేదు. ఐటీడీఏ కార్యలయం వద్ద పోలీసులు భారికేడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయం లోకి ఎవరూ వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలువాలంటూ పెద్ద ఎత్తున మహిళలు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. పలువురు గోడపై నుంచి దూకి లోనికి వెళ్లగా మహిళలు ఒక్కసారిగా మరో గేటు నుంచి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు.
కదంతొక్కిన ఆదివాసీలు